||భగవద్గీత ||

|| పదునైదువ అధ్యాయము ||

||ఉత్తమ పురుషుడు అంటే పురుషోత్తముని గురించి||

|| om tat sat||

ఉత్తమ పురుషుడు అంటే పురుషోత్తముని గురించి:

శ్రీభగవానువాచ
ద్వావిమౌ పురుషోలోకే క్షరశ్చాక్షర ఏవచ |
క్షరస్సర్వాణి భూతాని కూటస్థోsక్షర ఉచ్యతే||16||

ఆ శ్లోకానికి అర్థము సులభముగానే లభిస్తుంది.

ఈ లోకములో క్షరుడు అక్షరుడు అనబడు ఇద్దరు పురుషులు ఉన్నారు. సమస్త ప్రాణులలో క్షరమైన దేహముపై అభిమానము కలవానిని క్షరుడని చెప్పబడుచున్నాడు. కూటస్థములో ఉన్నవాడు అంటే సందిగ్ధావస్థలో ఉన్నవాడు అంటే దేహముకాక మనస్సు పై ఆధారపడినవాడు అంటే అత్మాభిమాని అక్షరుడు అనబడు చున్నాడు. అత్మాభిమాని అంటే ఆత్మపై విశ్వాసము కలవాడు అని. ఆత్మ పరమాత్మలు రెండు ఒకటే అన్న నిజానిని అవగాహన ఇంకా చేసికొనని వాడు క్షరుడు అన్నమాట.

ఆ అక్షరుడు భగవాదారధనలో , వైరాగ్యచింతనలో మునిగి ఆత్మ పరమాత్మలలో భేదము లేదని తెలిసికొనిన నాడు అతడే ఉత్తమపురుషుడు అనబడతాడు.

అంటే
క్షరుడు అక్షరుడవవచ్చు
అక్షరుడు ఉత్తమపురుషుడు కావచ్చు
ఆ ఉత్తమ పురుషుడే పురుషోత్తముడు.

రామాయణ యుద్ధకాండలో రాముడు చెప్పిన అధముడు క్షరుడు, మధ్యముడు అక్షరుడు , ఉత్తముడు అంటే పురుషోత్తముడు ఇక్కడకూడా పురుషోత్తముడే.

క్షరుడు అక్షరుడు అవటానికి , అక్షరుడు ఉత్తమపురుషుడు అవడానికి మార్గములు భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు.

ఉత్తమపురుషుడి గుణములు కూడా " నిర్మానమోహా జితసంగదోషాః..." అంటూ కృష్ణుడు చెప్పాడు.

ఇది కృష్ణార్జున సంవాదము అని గుర్తుపెట్టుకొంటే ఇంకో మాట కూడా సులభము గా అర్థమౌతుంది.

క్షరుడు అక్షరుడు వీళ్ళిద్దరికన్నా మించినవాడు ఇంకో ఉత్తమపురుషుడు అని చెపుతే మరి లోకములో అందరూ క్షరులు అక్షరులు అయితే మరి ఉత్తమ పురుషులు ఉన్నారా అని అనుమానము రావచ్చు. ఆ సందిగ్ధము తీర్చాడానికా అన్నట్లు కృష్ణుడు తనే పురుషోత్తముడు అని చెపుతాడు.

యస్మాత్ క్షరమతీతోsహమ్ అక్షరాదపి చోత్తమః|
అతోsస్మి లోకేవేదే చ ప్రథితః పురుషోత్తమః||18||

" నేను క్షరునికన్ననూ అక్షరుని కన్ననూ ఉత్తమునిగాఉన్నాను కనుక ఈ లోకములోనూ వేదములందు కూడా పురుషోత్తముని గా ప్రసిద్ధుడనై ఉన్నాను."

అంటే తనే ఒక పురుషోత్తముని గా అర్జునిడికి చెపుతాడు.

నిజానికి ఈ శ్లోకాలన్నీ ఈ లోకములో అంటూ మొదలు అవుతాయి. ( ద్వావిమౌ పురుషో లోకే..) ఈ పురుషుల కథనము అంతా లోకములో ఉన్న పురుషుల గురించే. ఇందులో చెప్పేది ఇంకో దేవతలగురించి కాదు. మనగురించే అన్నమాట.

వీళ్లిదరూ కాకుండా "ఉత్తమ పురుషః అన్యః" అన్నప్పుడు కూడా ఆ ఉత్తమ పురుషుడు కూడాఈ లోకములో ఉన్నపురుషులగురించే అన్న భావముతో నే చెప్పబడినమాట.

ఈ లోకములోనే అక్షరుని స్థితినుంచి ఉత్తమ పురుషుని స్థితికి చేరవచ్చన్నమాట. అంటే పురుషోత్తమునిగా ఈ లోకములోనే సిద్ధించ వచ్చు.

ఈ మాటే మోక్షముగురించి చెపుతూ కృష్ణుడు సాంఖ్య యోగములో కూడా మోక్షము మరణానంతరము కాదు ఈ జన్మలోనే ఇక్కడే సిద్ధించ వచ్చుఅని చెప్పాడు.

పురుషోతమ ప్రాప్తి అన్నా మోక్షము అన్నా ఒక్కటే అన్నమాట.

|| ఓమ్ తత్ సత్||


|| om tat sat||